పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంతో శ్రీకాంత్.ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ నివ్వగా, త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
చిత్ర ముహూర్తం సందర్భంగా ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ..రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్, అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా అని ప్రతినాయకుడు హెచ్చరిక చేయగా..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా, ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు, తలలు కోసి చేతికిచ్చేస్తా ..అంటూ హీరో, విలన్ మధ్య వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్ తేదీ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.