Padayaatra | మలయాళం సినీ పరిశ్రమలో తరతరాలుగా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోన్న సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ఇప్పటికీ అదే జోరుతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కథ, పాత్ర బలంగా ఉంటే చాలు అన్నట్టుగా విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా మమ్ముట్టి తన నెక్స్ట్ సినిమాను అధికారికంగా ప్రకటించగా, ఆ సినిమా టైటిల్‌నే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. మమ్ముట్టి నటించబోయే తాజా సినిమా పేరు ‘పాదయాత్ర’. ఈ సినిమాకు మలయాళం సినిమా ప్రపంచంలో లెజెండరీ ఫిల్మ్‌మేకర్‌గా పేరొందిన అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారు
మలయాళంలో వాస్తవికత, లోతైన భావోద్వేగాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా అదూర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడితో మమ్ముట్టి కలవడం సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. దీనికి కారణం గతంలో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’, ‘యాత్ర 2’ సినిమాలే. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కీలక ఘట్టం అయిన పాదయాత్రను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా మమ్ముట్టి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే అదే సిరీస్‌లో వచ్చిన ‘యాత్ర 2’ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మమ్ముట్టి మరోసారి ‘పాదయాత్ర’ అనే టైటిల్‌తో సినిమా ప్రకటించడంపై సహజంగానే రాజకీయ కోణంలో చర్చ మొదలైంది. అంతేకాదు, రెండు రోజుల క్రితమే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో ఈ సినిమా టైటిల్‌కి, రాజకీయ పరిణామాలకు లింక్ పెట్టి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా పూర్తిగా మలయాళ సినిమా కాగా, దీనికి ఏపీ రాజకీయాలతో లేదా సమకాలీన రాజకీయ పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. అదూర్ గోపాలకృష్ణన్ సినిమాలు సాధారణంగా రాజకీయ బయోపిక్లకంటే మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, వ్యక్తిగత పోరాటాల చుట్టూ తిరుగుతాయి. అందుకే ‘పాదయాత్ర’ కూడా ఒక వ్యక్తి జీవిత ప్రయాణం, ఆత్మ అన్వేషణ లేదా సమాజంతో అతడి సంబంధాన్ని ప్రతిబింబించే కథగా ఉండే అవకాశముందని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.