Chaitanya Rao | ఆస్ట్రేలియాలో 6లక్షల జీతం.. సౌకర్యవంతమైన జీవితం.. సినిమాకోసం ఈ రెండింటినీ వదిలేశాడు చైతన్యరావు. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ లేరు. ఎవర్ని కలవాలో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. కానీ తెగించి ముందడుగేశాడు. 2013లో ‘బందూక్’ అనే సినిమాలో వేషం సంపాదించాడు. అక్కడ్నుంచి పోరాటం చేస్తూనేవున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు బిజీ నటుడయ్యాడు. గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ‘చైతన్యరావు’ ఓ ఉదాహరణ. ఆయన నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ చిట్‌చాట్.
చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. చిరంజీవి అభిమానిని. ఎలాగైనా హీరో కావాలనేది లక్ష్యం. ‘మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ.. కష్టపడి వచ్చావ్… కరెక్ట్కాదు..’ అని మనసు చెబుతున్నా.. రిస్క్ తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ చేరుకున్నాను. చేయని ప్రయత్నం లేదు. పదేళ్లపాటు ఎన్నో అవస్థలు పడ్డాను. ఎట్టకేలకు ‘30 వెడ్స్ 21’ వెబ్‌సిరీస్ తొలి సక్సెస్‌ని ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
చిరంజీవిగారు నాకు అన్ని విషయాల్లోనూ ప్రేరణ. నటుడిగా వెంకటేశ్ యాక్టింగ్ అంటే ఇష్టం. యంగ్‌స్టర్స్‌లో తారక్, రణ్‌బీర్‌కపూర్ నా ఫేవరెట్ ఆర్టిస్టులు. నటుడిగా వీరంతా నాకు ఆదర్శమే. హీరోగా ఎదగడం కంటే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నాకిష్టం. అదృష్టం బావుండి మంచి పాత్రలే వస్తున్నాయి.
‘షరతులు వర్తిస్తాయి’ రిలేటబుల్ ఫిల్మ్. ఎవరి జీవితాలు వాళ్లు తెరపై చూస్తున్నట్టు ఉంటుందీ సినిమా. క్లీన్ మూవీ అన్నమాట. ఇందులో నా పాత్ర పేరు చిరంజీవి. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌ని. ఇంట్లో పెద్ద కొడుకుని. కావల్సినన్ని బాధ్యతలుంటాయి. వాటికోసం శ్రమిస్తూవుంటా. ఇందులో హీరోయిన్ పేరు విజయశాంతి. డామినేటెడ్ పర్సన్. చిరంజీవి శ్రమైకజీవి. పేర్లకు తగ్గట్టే కేరక్టరైజేషన్స్ కుదిరాయి.
సినిమా ఆద్యంతం వినోద భరితంగా ఉంటుంది. ఎమోషన్స్‌కి కొదవ ఉండదు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. దర్శకుడు కుమారస్వామి ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడే మంచి సినిమా అవుతుందనిపించింది. అందుకు తగ్గట్టే అందరూ మెచ్చేలా ఆయన తీర్చిదిద్దారు. చూస్తున్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది.
నా కెరీర్లో మెమరబుల్ మూవీ అంటే ‘కీడాకోలా’. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ లాంటి హీరోలను పరిచయం చేసిన తరుణ్‌భాస్కర్.. నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడం నా లైఫ్‌లో మరిచిపోలేను. పైగా బ్రహ్మానందంగారి కాంబినేషన్. ఆ సినిమా చేస్తున్నప్పుడే నేను సాధించాననే ఫీలింగ్ కలిగింది. మళ్లీ తరుణ్సార్తో కలిసి పనిచేయాలనుంది.
‘షరతులు వర్తిస్తాయి’ ఈ నెల 15న విడుదల కానుంది. ఆ తర్వాత ‘పారిజాత పర్వం’ అనే సినిమా చేశాను. అది కూడా త్వరలో విడుదల కానుంది. ఇంకా దేవకట్టాగారి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేశాను. ఇదిగాక ‘కంటైనర్'(వర్కింగ్‌టైటిల్) అనే సినిమా కూడా చేశాను. ఈ సినిమా కథ 70శాతం కంటైనర్లోనే ఉంటుంది. ఇదొక విభిన్నమైన ప్రయోగం. అందుకే ఈ సినిమాకు నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేను. ఇంకా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.