తెలుగు హీరో అంటే… ఒంటి చేత్తో డజన్ల మంది విలన్లను కొట్టేస్తాడు. బైకులు.. సుమోలు.. లారీలు.. ఆ మాటకొస్తే రైళ్లనూ చూపుడు వేలుతో నియంత్రిస్తాడు. కత్తులతోనే కాదు.. కంటిచూపుతో కూడా విలన్లను రఫ్పాడిస్తాడు.ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు హీరోకు అతీంద్రియ శక్తులు ఉన్నాయనిపిస్తుంది. కథ.. కథలోని హీరోయిన్.. ఇతర పాత్రలు.. సన్నివేశాలు.. అన్నీ హీరో చుట్టూ తిరగాల్సిందే! గతకాలమంతా ఇంతే! రోజులు మారాయి.. మన హీరో మారుతున్నాడు.. కథలో తనో పాత్రగానే కాదు.. కథ వెంటే తన పాత్రని తిప్పుతూ.. నేచురల్‌గా నటిస్తున్నాడు.. ఒక్క ఫైట్ కూడా చేయకుండానే తనెంత బలవంతుడో చెబుతున్నాడు.. అతిగా డైలాగ్స్ చెప్పకుండా.. మనలాగే మాట్లాడుతున్నాడు..
Telugu Cinema | బడ్జెట్లు.. భారీ సెట్లు.. ఎందుకులే.. మంచి కథ చాలని సింపుల్‌గా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు మన హీరోలు. ఇమేజ్‌ని పక్కన పెట్టేసి ప్రపంచ సినిమాలో మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? అని ఆలోచిస్తున్నారు. హీరోయిజాన్ని సంస్కరించుకుంటున్నారు. పాత్రలో ఎక్కువ, తక్కువలు చూడకుండా.. ప్రపంచ సినిమాని నెగ్గే ప్రయత్నం చేస్తున్నారు మన కథానాయకులు.
సిక్స్ ప్యాక్‌లు.. స్టయిలిష్ లుక్లపైనే కాకుండా.. కథల ఎంపికపైనా మన హీరోలు బాగానే కసరత్తులు చేస్తున్నారు. కథను మింగేయాలనే ధ్యాస మానుకుని.. కథకు మేమెంత మేరకు న్యాయం చేయగలమా? అని ఆలోచిస్తున్నారు. ఈ తరం హీరోలే కదా ఇలా ఆలోచించేది… అగ్ర కథానాయకుల ఫార్మాట్ ఎప్పుడు మారింది గనుకా!? అనుకోవద్దు. మన బాలయ్య చేసిన నేలకొండ భగవంత్ కేసరి కథని గమనిస్తే మీకే అర్థం అవుతుంది.
కథా వస్తువుకు విలువనిచ్చేలా తన పాత్రలో ఒదిగిపోయాడు. నేటి తరం ఆడపిల్లల్ని హీరోలు చేస్తూ తనో మామూలు మధ్యతరగతి వ్యక్తిగా కథలో ఇమిడిపోయాడు. విజ్జూ పాపకి రక్షణగా నిలుస్తూ.. ‘గుడ్ టచ్… బ్యాడ్ టచ్’ ఏంటో చెబుతూ ప్రేక్షకుల హృదయాలను తాకాడు. అంతేనా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి సైతం ‘సైరా..’లో కథనే హీరోను చేశాడు. మన వెంకీ ఓటెప్పుడూ కథలకే. ఎప్పుడో మల్లీశ్వరీతో మొదలుపెట్టి.. ఎఫ్2 దాకా.. ఇమేజ్ చట్రాన్ని పూర్తిగా బ్రేక్ చేసి అబ్బురపరుస్తున్నాడు.
తరంలో మార్పు..
వారసత్వంగా నటన వైపు అడుగులేసిన కథానాయకులు తెలుగు సినిమా స్టామినాని పాన్ ఇండియాకే కాదు.. ప్రపంచానికే పరిచయం చేస్తున్నారు. కారణం.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా.. ఇంకేదో చేయాలని తపిస్తుండటమే. మగధీరుడిగా దూసుకెళ్తున్న రామ్‌చరణ్ ఒకవైపు.. అరవింద సమేత వీరరాఘవుడిగా బాక్సాఫీస్‌పై విరుచుకుపడిన జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకో వైపు.. భిన్నమైన కథలకు మొగ్గు చూపుతూ తమలో నటనకు సాన పెడుతున్నారు. ‘రంగస్థలం’లో సిట్టిబాబే కనిపిస్తాడు గానీ.. రామ్‌చరణ్ కనిపించడు. పాత్ర కోసం హ్యాండ్సమ్ చెర్రీ.. వినికిడి లోపం ఉన్న వ్యక్తిలా మారిపోయాడు.
కథ కోసం తనని తాను ఎంతో తగ్గించుకుని.. పాత్ర రూపంలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ‘పుష్ప’తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మొత్తానికి తగ్గేదేలేదని బలంగా మన టాలీవుడ్ పేరు వినిపించేలా చేశాడు. యాస.. బాష.. బాడీలాంగ్వేజ్ తో పుష్ప అంటే.. ‘ఫ్లవర్ కాదు.. ఫైరూ’ అంటూ భుజం ఎగరేశాడు. ఇదంతా గమనించాడో ఏమో.. మన జక్కన్న ఏకంగా.. రెండు కత్తుల్ని ఒకే ఒరలో పెట్టేసి.. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రభంజనం సృష్టించాడు. ప్రపంచ సినిమా వేదికలపై మా హీరోలు మారడమే కాదు.. కలిసికట్టుగా కథల్ని భుజాన వేసుకుని ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడరని నిరూపించాడు. ఇంతకంటే ఏం కావాలి.. మన హీరో మారుతున్నాడని చెప్పడానికి!!
నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు..
అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన జర్నీ మొదలెట్టి.. హిట్టు మీద హిట్టుతో దూసుకెళ్తున్న నాని నేచురల్ స్టార్‌గా స్థిరపడ్డాడు. ఎప్పుడో పుష్కరకాలం కిందట వచ్చిన ‘భీమిలీ కబడ్డి జట్టు’లో ఒకడిగా కనిపించి.. ఏడిపించిన సూరిబాబు ఇంకా మనకి గుర్తుకొస్తాడు. కథలో ఈగ హీరో అయినా నాకేం ఫరక్ లేదని ఎప్పుడో ప్రూవ్ చేశాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో తన పాత్రకి న్యాయం చేస్తూనే… మరో పాత్ర తాలూకు భావజాలాన్ని చివరి వరకూ మోసుకెళ్లి ‘రిషి’ గొప్పతనాన్ని చాటిచెప్పాడు.
భిన్నమైన కథల్ని చేస్తూ ‘హాయ్.. నాన్నా’ సినిమాలో ఓ తండ్రిని హీరోని చేశాడు. అమ్మ కథని కూతురికి చెబుతూ.. అమ్మని హీరోని చేశాడు. బిడ్డని తల్లికి పరిచయం చేసి.. కూతుర్ని హీరోని చేశాడు. ఆ ఫీల్‌గుడ్ మూవీ వైబ్స్ అలాగే ఉన్నాయి. అంతలోనే ‘సరిపోదా శనివారం’ అంటూ థియేటర్లలో సందడి చేశాడు. ప్రతినాయకుడు సూర్యనే సినిమాలో హీరో అని బాహాటంగా ప్రకటించాడు. హీరో విలన్ని పొగడటం అంటే.. మన కథానాయకుడు మారుతున్నట్టేగా!
చిన్న సినిమాల్లోనూ..
ఒకప్పుడు చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. హీరో ఎంట్రీ సీన్ వచ్చిందంటే.. పూనకాలు వచ్చేవి. కాళ్ల నుంచి కెమెరా స్లో మోషన్లో హీరో ముఖం దగ్గరికి రావడానికి చాలా టైమ్ పట్టేది. కానీ, ఇప్పుడొస్తున్న బడ్జెట్ సినిమాల్ని చూస్తే కథే హీరో అంటే… నమ్మి తీరాల్సిందే! నమ్మకపోతే ‘బలగం’ సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేదే కాదు. దిల్ రాజు ఆ సినిమా నిర్మించే వాడే కాదు. హీరో రానా పబ్లిసిటీ చేసేవాడే కాదు. ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచేది కాదు. బలగం సినిమాలో ప్రియదర్శిని హీరోగా చూపించలేదు దర్శకుడు వేణు. తెలంగాణ సంస్కృతినే కథానాయకుణ్ని చేశాడు. అందుకే, ఆ సినిమాకు కథే హీరో అయింది.
ఇంకా చెప్పాలంటే.. ఈ మధ్య పలు సినిమాల్లో హీరోగా కనిపిస్తున్న సుహాస్ కూడా కథనే నమ్ముకుంటున్నాడు. ఒడ్డూ.. పొడుగూ.. రంగు.. రూపం.. అంటూ గీసిన గీతల్ని చెరిపేసి మంచి కథలు ఎంచుకుంటూ మాయ చేస్తున్నాడు. ‘పద్మవిభూషణ్’లో అమ్మ చాటు రచయితగా ప్రేక్షకుల్ని మెప్పించాడు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’లో ఒకడిగా.. సామాజిక అంశాల్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ వైష్ణవే అసలు హీరో. అయినా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ తమ పాత్రలకు అంతే హుందాగా న్యాయం చేశారు. ఈ కాలం కుర్ర హీరోలు.. తమ ఈక్వేషన్స్ అండ్ కాలిక్యులేషన్స్ వేరని చెప్పకనే చెబుతున్నారు.
ఆ ‘సీత’కి రాముడు కాలేకపోయారు!!
మనోళ్లు ఎంత మారారని చెప్పుకొన్నా.. కావ్యాల్లాంటి కథలు కొన్ని మనోళ్లని దాటుకుని పక్క ఇండస్ట్రీ హీరోల దగ్గరికి వెళ్తున్నాయి. అందులో ‘సీతారామం’ ఒకటి. హను రాఘవపూడి చిత్రీకరించిన ఆ కథలో రాముడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే! యుద్ధంతో రాసిన ప్రేమకథలో నటించాలంటే.. హీరో మంచి సైనికుడై ఉండాలి. కానీ, మన తెలుగు హీరోలు రాజులా ఆలోచించి ఉంటారేమో. అందుకే ఈ కథని వదులుకుని ఉంటారు. అలాగే, ఎప్పుడో విడుదలైన ‘గజనీ’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ కథను మురగదాస్ ఇంచుమించు 12 మందికి చెప్పాడట.
అందులో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారట. చివరికి సూర్య ఓకే చేశాడట. గతేడాది విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న ధనుష్ ‘సార్’ సినిమాను మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. ఈ కథ మన తెలుగు హీరోలను దాటుకుని ధనుష్ చేతిలో పడింది. ధనుష్ ‘సా….ర్’ ఏం పెర్ఫార్మెన్స్ అని తెలుగోళ్లతో అనిపించుకున్నాడు. సో.. ఎప్పుడూ మంచి కథే హీరో అని నమ్ముతున్న రోజుల్లో… మన హీరోలు మరింత సెన్సిబుల్‌గా కథల్ని ఎంచుకొని సక్సెస్‌లు కొట్టాలని కోరుకుందాం.
…? రాజేశ్ యడ్ల