సినీరంగంలో పదహారేళ్లుగా ప్రయాణాన్ని సాగిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో తనదైన అభినయంతో మెప్పిస్తోంది. అగ్ర కథానాయికగా ఈ ప్రయాణం తనకెంతగానో సంతృప్తినిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘పదిహేనేళ్ల వయసులో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. అప్పటినుంచి నిర్విరామంగా పనిచేస్తున్నా. సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియకుండా జీవితం గడచిపోతోంది. పదిహేనేళ్లుగా పనిచేస్తున్నా.. ప్రతి రోజు షూటింగ్ కొత్తగానే అనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో పాత్రల ఎంపిక గురించి పెద్దగా ఆలోచించలేదు. అగ్ర నాయికగా ఇమేజ్ వచ్చిన తర్వాత సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్నా. ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడి ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకునే ఆలోచనతో ఉన్నా’ అని చెప్పింది తమన్నా. ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు ఓటీటీ వేదికల మీద కూడా సత్తాచాటుతోంది.