‘అందరికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ ఇది. మాతృకలోని హీరోయిన్ పాత్ర నాకు బాగా నచ్చింది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో చాలా మార్పులు చేశారు’ అని చెప్పింది ఈషా రెబ్బా. ఆమె తరుణ్భాస్కర్తో కలిసి నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. మలయాళ హిట్ సినిమా ‘జయ జయ జయహే’కు రీమేక్ ఇది. ఈ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్కు ఏఆర్ సజీవ్ దర్శకుడు. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో ముచ్చటించింది కథానాయిక ఈషా రెబ్బా.
గోదావరి నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, అక్కడి యాసను పలికే విషయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పింది. ‘నా స్వస్థలం వరంగల్. అయితే మా అమ్మ సొంత ఊరు రాజమండ్రి కావడం వల్ల వేసవి సెలవుల్లో అక్కడికి వెళ్తుండేదాన్ని. అలా గోదారి యాసపై మంచి పట్టు దొరికింది. ఈ సినిమాలో శాంతి క్యారెక్టర్ చేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ తరహా పాత్ర కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. కెరీర్లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర చేయాలనుకున్నా. ఈ సినిమాతో నా కల నెరవేరింది’ అని ఈషా రెబ్బా చెప్పింది.