‘యూనివర్సిటీలో చదువుకున్న ముగ్గురు.. ఓ గ్రామంలో గుప్తనిధులకోసం చేసిన అన్వేషణే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్” అన్నారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. ‘హుషారు’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హర్ష ‘ఓం భీమ్ బుష్’ కోసం మరోసారి మెగా ఫోన్ పట్టారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధానపాత్రధారులు. ఈ చిత్రం నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీహర్ష విలేకరులతో ముచ్చటించారు. ‘గుప్త నిధుల కోసం విద్యావంతుల వెతుకులాట ఈ సినిమా. ‘ఓం భీమ్ బుష్’ అనేది మ్యాజికల్ పదం. చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు సరదాగా వాడే మాట.
ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ ఉంటుంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకెబిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే ఈ కథకు ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ యాప్ట్’ అన్నారు శ్రీ హర్ష. యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న 30ఏళ్లు పైబడిన ముగ్గురు యువకులు, యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చి ఏం చేస్తారనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని, ప్రతి సన్నివేశం లాజిక్‌తో ముడిపడి వుంటుందని, బలమైన కథ, కథనాలు, ఎమోషన్సూ ఇందులో ఉంటాయని, ఇలాంటి పాయింట్ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదని కచ్చితంగా చెప్పగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారని, చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా అభినందనీయంగా ఉంటుదని, నిర్మాతల సహకారం వల్లే సినిమాను ఇంతబాగా తీయగలిగానని శ్రీహర్ష సంతోషం వ్యక్తం చేశారు.