OG | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ (OG) చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దసరా కానుకగా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ‘ఓజీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా పూర్తిగా ఆకట్టుకునేలా ఉందని సమాచారం. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించగల సినిమాగా ఉంటుందని తెలుస్తుంది.
ఓవర్సీస్లో సినిమా హవా మొదలైంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే $2 మిలియన్ మార్క్ దాటి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేశాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఇది ట్రైలర్ విడుదల కాకముందే సాధించిన ఫీట్ కావడం గమనార్హం. ట్రైలర్ రాగానే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఓజీ’ మరో అరుదైన రికార్డు సాధించింది. ప్రముఖ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన District యాప్, సీట్ మ్యాప్ లో ప్రతి సీటుపై OG అనే ట్యాగ్ కనిపించేలా డిజైన్ చేయడం సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపుగా మారింది. తెలుగు సినిమాల్లో ఇలా మొదటిసారి జరగడం విశేషం.
ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. “అమలాపురం నుంచి అమెరికా వరకూ OG మోత మోగిపోతోంది” అంటూ వారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఓజీ’ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రసాద్ ఐమ్యాక్స్ సంస్థ తమ వెబ్సైట్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా, బుక్ మై షో, District యాప్‌లలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయినా కూడా మొదటి రోజు ఫుల్ హౌస్ షోలు ఖాయంగా కనిపిస్తున్నాయి. విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా, ‘ఓజీ’ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తొలిరోజే 100 కోట్ల మార్క్‌ను దాటేసేలా ఉందని అంచనాలు ఉన్నాయి. గతంలో ‘హరిహర వీరమల్లు’తో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ఈసారి ‘ఓజీ’తో ఫ్యాన్స్ ఆశలకి అవధులు లేకుండా చేస్తాడని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.