అగ్ర హీరో పవన్ కల్యాణ్ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ వేసవి బరిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది. మే 8న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేరంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘చారిత్రక యోధుడు వీరమల్లుగా పవన్‌కల్యాణ్ సరికొత్త అవతారంలో కనిపిస్తారు. అణువణువునా ధిక్కార స్వభావం, న్యాయం కోసం తపించే వ్యక్తిగా ఆయన పాత్ర శక్తివంతంగా సాగుతుంది. మొఘల్ రాజుల కాలం నాటి ఈ కథ ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో నడుస్తుంది. పీడితుల పక్షాన వీరమల్లు యుద్ధం రోమాంచితంగా అనిపిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించి సినిమాను పూర్తి చేశారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, నిర్మాత: ఏ.దయాకర్ రావు.