Uttam Mohanty | సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27 రాత్రి కన్నుమూశారు. ఇక ఉత్తమ్ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1977లో అభిమాన్ (Abhiman) చిత్రంతో ఒడియా సిని పరిశ్రమలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఉత్తమ్ మొహంతీ. నటుడిగా రాణిస్తూ.. 1980, 90లలో అగ్ర నటుడిగా ఒక వెలుగు వెలిగారు. తన 50 ఏండ్ల సినీ కెరీర్లో దాదాపు 135కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో ఒడియాతో పాటు బెంగాలీ, హిందీ చిత్రాలు ఉన్నాయి. మొహంతీ భార్య అపరాజితతో పాటు అతడి కుమారుడు బాబుషాన్ కూడా ఒడియా సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ నటులు.
ఉత్తమ్ మొహంతీ మరణవార్తపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్పందిస్తూ.. ఉత్తమ్ మొహంతీ మరణం ఒడియా కళా ప్రపంచానికి తీరని నష్టం అంటూ అభివర్ణించారు. మరోవైపు ఉత్తమ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది.