Nuvve Kavali | తెలుగు సినిమా ప్రేమకథల్లో ఓ కొత్త శకానికి నాందిగా నిలిచిన ‘నువ్వే కావాలి’ చిత్రం నేటితో విడుదలై 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో యువతను మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కె. విజయభాస్కర్ ఈ సినిమా విజయాన్ని నేటికి కూడా మధుర జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటున్నారు. తరుణ్, రిచా జంటగా నటించిన ఈ చిత్రంలో సహజమైన పాత్రలు, హృదయాన్ని తాకే కోటి సంగీతం, చక్కటి ఛాయాగ్రహణం, అద్భుతమైన సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, హరి అనుమోలు ఛాయాగ్రహణం ఇలా అన్ని విభాగాలు కలిసి ఈ సినిమాను ఓ క్లాసిక్‌గా నిలిపాయి.
దర్శకుడు విజయభాస్కర్ మాట్లాడుతూ .. “ఆ రోజుల్లో యాక్షన్, మాస్ సినిమాలు హవా సాగిస్తున్న సమయంలో, సహజత్వంతో నిండిన ప్రేమకథను చూపించాలన్న ఆలోచన నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలైంది. మలయాళ హిట్ ‘నిరం’ సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచనతో త్రివిక్రమ్, నేను కలిసి ఈ కథను తీర్చిదిద్దాం. సీతారామశాస్త్రి, భువనచంద్ర లిరిక్స్, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ, హరి అనుమోలు ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ సినిమా చిరస్థాయిగా నిలిచింది అన్నారు. హీరో తరుణ్ ఎంపికపై జరిగిన ఆసక్తికర ప్రయాణాన్ని దర్శకుడు గుర్తు చేసుకుంటూ .. మొదట సాయికిరణ్‌ను హీరోగా ఆలోచించాం, కానీ రెండో పాత్రకు ఆయన బాగా సరిపోతారని అనిపించింది. హీరో పాత్ర కోసం మూడున్నర నెలలు వెతికాం. ఒకరోజు రోజారమణి ఇంట్లో తరుణ్‌ను చూసిన క్షణమే నాకు కథకి తగ్గ హీరో దొరికినట్టు అనిపించింది. వెంటనే ఫైనల్ చేశాం అన్నారు.
ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే వర్షం సీన్ షూటింగ్ గురించి మాట్లాడుతూ.. ముందు ఫైరింజన్లతో ప్లాన్ చేసినప్పటికీ, తర్వాత ఆ సీన్‌ను నిజంగానే వర్షంలోనే షూట్ చేశాం. ఆ రోజు దేవుడే సహకరించాడు అనిపించింది. నాలుగు గంటల్లో ఆ సన్నివేశం పూర్తయ్యింది. అది నా కెరీర్లో మరిచిపోలేని రోజు” అని చెప్పారు. చిత్రం విడుదలై 25 ఏళ్లు గడిచినా ‘నువ్వే కావాలి’ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యూట్యూబ్, టీవీ ప్రసారాల్లో దీని పాటలు, సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. స్నేహం నుండి ప్రేమకు మారే అనుభూతిని మనసుకు హత్తుకునేలా చూపించిన సినిమా మరొకటి లేదన్నట్టు భావించే వారెందరో ఉన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ‘నువ్వే కావాలి’ నిజంగా తెలుగు సినిమా ప్రేమకథల పరంపరలో అద్వితీయమైన క్లాసిక్ అనే చెప్పాలి.