NTR | ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా సమయం కేటాయించిన ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర చిత్రాన్ని త్వరగానే ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఇక ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం వార్ 2 ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత జూనియర్ సినీ పితామహుడి బయోపిక్ చేయబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా (మ్యాక్స్ స్టూడియోస్) ప్రమేయం ఉందని టాక్.
ఇప్పటికే స్ట్రిప్ట్ సిద్ధం కాగా, అది విన్న జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయి ఈ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమా అనౌన్స్ చేయగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలియజేశారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని అప్పుడు చెప్పగా, కాని ఆ తర్వాత దాని నోరు విప్పింది లేదు. కాని ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని బాంబే మీడియాలో తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. అలాంటి కంటెంట్ కచ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ ప్రాజెక్ట్ చేస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా కార్యరూపం దాలిస్తే ప్రపంచ సినిమా గొప్పగా చెప్పుకునే క్లాసిక్ అవడం ఖాయం. మేడ్ ఇన్ ఇండియా మూవీ.. ఇండియన్ సినిమా పుట్టుక, పెరుగుదలను తెలియజేస్తుంది.సినిమాలకి బీజం ఎక్కడ పడింది, ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది అనేది చిత్రంలో చూపించనున్నారట. తారక్.. దాదా ఫాల్కే పాత్ర పోషించనున్నాడని వార్తలు రాగానే, ఫాల్కే గెటప్ లో తారక్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.