NTR | ‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న తారక్… అదే జోరులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్ ఆడియెన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా పెద్ద స్థాయిలో హిట్ కాకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మేజర్ రఘు విక్రమ్ చలపతి పాత్రలో తారక్ నటన విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు ఇదే పాత్ర మరోసారి కనిపించబోతోందా? అనే ప్రశ్న బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు… ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్నది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్న ప్రచారం ఊపందుకుంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం తన స్పై యూనివర్స్‌ను మరింత విస్తరించే పనిలో ఉంది. ఇప్పటికే ‘టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ సినిమాలను ఒకే యూనివర్స్‌లో లింక్ చేస్తూ భారీ విజయాలు అందుకుంది. 2023లో విడుదలైన ‘పఠాన్’ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ విజయం తర్వాత ‘పఠాన్’ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ‘పఠాన్ 2’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నాడని బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘వార్ 2’లో కనిపించిన మేజర్ రఘు విక్రమ్ చలపతి పాత్రే ‘పఠాన్ 2’లో కూడా కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది.
గతంలో ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ‘టైగర్’ పాత్రలో అతిథిగా కనిపించి అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అదే తరహాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో YRF స్పై యూనివర్స్ మరింత బలపడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు యష్ రాజ్ ఫిల్మ్స్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘వార్ 2’ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోవడంతో… తారక్ తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి షారుఖ్ ఖాన్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ‘పఠాన్ 2’లో నటిస్తాడా? లేదా ఇది కేవలం పుకార్లకే పరిమితమవుతుందా? అన్నది త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్త బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.