NTR | హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్-2’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ తొలి స్ట్రెయిట్ హిందీ చిత్రమిదే కావడంతో ఆయన అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్పైథ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇందులో ఎన్టీఆర్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చిత్ర రచయిత అబ్బాస్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
ఈ సినిమా డైలాగ్స్ అన్నీ తానే రాశానని, షూటింగ్ మొత్తం పూర్తయిందని, ఆగస్ట్ 25న విడుదలయ్యే అవకాశం ఉందని అబ్బాస్ తన సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. హృతిక్‌రోషన్, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘వార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దాంతో సీక్వెల్‌గా రానున్న ‘వార్-2’పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలేర్పడ్డాయి.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారని చిత్రబృందం పేర్కొంది. జనవరి 9, 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు.