Nora Fatehi | 1999లో వచ్చిన ‘దిల్బర్ దిల్బర్’ పాటకున్న క్రేజే వేరు. మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆడిపాడిన ఈ పాటకు ఫిదా అవ్వని నాటితరం కుర్రకారు లేరు. అయితే.. 2018లో ‘సత్యమేవ జయతే’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేశారు. ఇందులో బాలీవుడ్ ఐటమ్ గర్ల్ నోరా ఫతేహి వేసిన స్టెప్పులకు నేటితరం కుర్రాళ్లు నోరెళ్లబెట్టారు. అయితే.. ఈ పాట కోసం తాను ధరించాల్సిన డ్రెస్ మరీ పొట్టిగా ఉండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందట నోరా.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులను చెప్పుకొచ్చింది. ‘దిల్బర్ దిల్బర్’ పాట రీమిక్స్ అనగానే నోరా ఎగిరి గంతేసిందట. దీన్ని మామూలు ఐటం సాంగ్స్లా కాకుండా.. ప్రత్యేకంగా చేయాలనుకున్నదట. ఆమాటే ఆ చిత్ర నిర్వాహకులతోనూ చెప్పిందట. కానీ, అప్పుడు వాళ్లు ఇచ్చిన కాస్ట్యూమ్స్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యిందట. “వాళ్లిచ్చిన జాకెట్ చాలా చిన్నగా ఉంది. నాకు ఏమాత్రం నచ్చలేదు. నన్ను మరీ అంత సెక్సువలైజ్ చేసి చూపించకండని వారికి చెప్పాను.
చేసేది సెక్సీ సాంగే అయినా.. మరీ అసభ్యకరంగా ఉండొద్దని కోరాను. ఇంత చిన్న బట్టలు వేసుకోలేను.. ఇంకేమైనా ఇవ్వండని అడిగాను. తర్వాతి రోజు మరో బ్లౌజ్ రెడీ చేశారు. అది కూడా చిన్నగానే అనిపించొచ్చు. కానీ, ముందు ఇచ్చినదాని కంటే అది ఎంతో మెరుగ్గానే ఉంది!” అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. తనకు ఏమాత్రం ఇష్టం లేకున్నా.. తానేంటో నిరూపించుకోవాలనే ఆ సాంగ్లో నటించానని చెబుతున్నది నోరా. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. కెనడాకు చెందిన ఈ యాక్టర్ కమ్ డ్యాన్సర్.. తన అందం, నృత్యంతో అభిమానులను అలరిస్తున్నది. బాహుబలి-1లోనూ ‘మనోహరా..’ పాటలో మెరిసి.. తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా’లోనూ నటిస్తున్నది.