Telugu Film Chamber of Commerce | తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ మే 30వ తేదీ నుండి వరుస సమావేశాలను నిర్వహించనుంది. వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం.
ప్రస్తుతం ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల రెవెన్యూ షేరింగ్ విధానంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో జూన్ 1 నుంచి థియేటర్ల సమ్మెకు వెళ్లాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 24న జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య కీలక జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రెండు పక్షాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.