ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించారని దేశ వ్యాప్తంగా విమర్శలొచ్చాయి. వివిధ రంగాల మేధావులు కూడా ఈ సినిమా కథాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయమై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సినిమా హక్కుల కోసం ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. మాకు ఆమోదయోగ్యమైన ఆఫర్ లభిస్తే అప్పుడు ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు. సమాజంలోని భిన్న వర్గాల నుంచి ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సినిమా హక్కుల విషయంలో ఓటీటీ సంస్థలు ఆసక్తిచూపడం లేదని తెలుస్తున్నది.
రాజకీయపరంగా రహస్య అజెండాను అమలు చేయడంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, అందుకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు దూరంగా ఉండటమే మంచిదని ఓటీటీ సంస్థలు భావిస్తున్నట్లు తెలిసింది. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా ఈ చిత్రాన్ని రూపొందించారు.