Varun Sandesh | కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయాడు. గతేడాది సందీప్ కిషన్ నటించిన మైఖేల్‌లో కీలక పాత్రలో నటించాడు. ఈ సారి నింద (Nindha) సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నాడు వరుణ్ సందేశ్.
థ్రిల్లర్ జోనర్లో రాజేశ్ జగన్నాథం దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం నింద. ఈ చిత్రానికి రాజేశ్ జగన్నాథం రైటర్కమ్ ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం. కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తనికెళ్ల భరణి చత్రపతి శేఖర్, భద్రం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నింద విశేషాలు వరుణ్ సందేశ్ మాటల్లోనే..
నింద కథను ఒప్పుకునేందుకు కారణమేంటి.. మీ పాత్ర గురించి..?
రొటీన్ సినిమాలు చేస్తుండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాలు చేస్తున్నానేంటి అనుకొని..గ్యాప్‌లో యూఎస్ వెళ్లిన టైంలో రాజేశ్ చెప్పిన నింద కథ బాగా నచ్చింది. వెంటనే ఒకే చెప్పేశా. సినిమాలో నా పాత్రకు నా నిజజీవిత పాత్రకు ఏ మాత్రం పోలిక ఉండదు. నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి భిన్నమైన రోల్ ఇందులో చేశా.
నింద సినిమాతో కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు..?
ఇప్పటికే సస్పెన్స్, క్రైం, థ్రిల్లర్ జోనర్లలో చాలా సినిమాలొచ్చాయి. నింద సినిమాలో మాత్రం స్క్రీన్ ప్లే కొత్తగా ఉండనుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్టును నటీనటులెవ్వరికీ చెప్పకపోవడంతో అందరితో క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడెవరనేది తెలియకపోవడంతో న్యాచురల్‌గా నటించారు. కథ చెప్పినప్పుడు నేను ఊహించేందుకు ప్రయత్నించా. కానీ చెప్పలేకపోయా.
నింద షూట్లో ఛాలెంజింగ్‌గా అనిపించిందేంటి..?
కానిస్టేబుల్ మూవీ చిత్రీకరణలో నా కాలుకు గాయమైంది. ఆ వెంటనే నింద షూట్ ఉండగా.. ఆర్టిస్టులంతా అప్పటికే షూట్‌కు రెడీగా ఉన్నాయి. నా ఒక్కడి కోసం షూట్ రద్దు చేయడం ఇష్టం లేక రాజేశ్ జగన్నాథం డెడికేషన్ చూసి గాయంతోనే చిత్రీకరణలో పాల్గొన్నా.
మీ కొత్త సినిమాల గురించి..?
నింద విడుదలైన తర్వాత ఓ క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ సినిమాలో పాత్రకు కొత్త ప్రాజెక్టులోని రోల్‌కు ఏ మాత్రం పోలిక ఉండదు. జులైలో ప్రమోషన్స్ మొదలుపెట్టి ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కానిస్టేబుల్లో కూడా నటిస్తున్నా.