‘తెలుగు సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడొద్దని సినిమా పెద్దలకు చెబుతున్నా. డిమాండ్లను నెరవేర్చుకోవడం మనహక్కు. తెలుగు చిత్రపరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు. తెలుగు సినీ పరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు. ఆపలేరు’ అని అన్నారు పవన్‌కల్యాణ్. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయితేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహించారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమ చాలా సెన్సిటివ్. ప్రతి ఒక్కరికి ఈజీ టార్గెట్‌గా మారింది. సినిమావాళ్లపై అనవసర కథనాలకంటే పొలిటిక్ క్రైమ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అది సమాజానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కల్యాణ్‌ను అడ్డుకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్లు దారికొస్తారని వైసీపీ భావిస్తుంది. అది మంచి పద్దతి కాదు. నా మీద కోపంతో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్టకొడుతున్నారు. నా మీద కోపం ఉంటే నా సినిమాల్ని ఆపేయండి. అంతేకాని ఇండస్ట్రీ మీద కక్ష్యసాధించకండి. నా సినిమాల్ని ఆపేసి మిగతా వాటిని విడుదల చేసుకోమని చెప్పండి. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్‌రాజ్‌ను అవుట్‌సైడర్ అంటున్నారు. భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రకాష్‌రాజ్ నచ్చకపోతే వేరే దారుల్లో ఎదుర్కోండి. నాన్‌లోకల్ అనే విభజన మాత్రం తీసుకురావొద్దు. సినిమా ఇండస్ట్రీలో కుల, ప్రాంతీయతత్వానికి తావులేదు. పార్టీలకు అతీతంగా ఇండస్ట్రీపై గౌరవం చూపించాలి. సినిమా వ్యాపారం చిన్నది కావొచ్చు కానీ..దాని ప్రభావం చాలా పెద్దది. సినిమావాళ్లు కోట్లు తీసుకుంటున్నారని కొందరు సన్నాసులు ఆరోపణలు చేస్తున్నారు. జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ కష్టపడుతూ..టాక్స్‌లు కడుతూ సంపాదిస్తున్నాం. తప్పుడు కాంట్రాక్టులతో అడ్డగోలుగా సంపాదించడం లేదు. ఎవరైనా సరే చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు. సంపదసృష్టి జరిగినప్పుడే ఎవరైనా ఇతరులకు సహాయం చేయగలుగుతాం. అలాంటిది మేము సంపాదిస్తుంటే తప్పంటున్నారు. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో తెలియడంలేదు. ఇది వైసీపీ పార్టీ రిపబ్లిక్ కాదు. ఇండియన్ రిపబ్లిక్. విచక్షణారహితంగా అధికారాన్ని వాడేస్తే అది ఎటు దారి తీస్తుందో తెలియదు’ అన్నారు. దేవా కట్టా మాట్లాడుతూ “ప్రస్థానం’ తర్వాత నేను చేసిన తప్పుల వల్ల అందరికీ నాపై నమ్మకం పోయింది. అలాంటి తరుణంలో తేజ్ నాలో ధైర్యాన్ని నింపి ఈ సినిమాను సైనికుడిలా కాపాడాడు’ అని అన్నారు.