Nithya Menen | తన గురించి చాలామందికి తెలియని విషయాలను మీడియా సాక్షిగా బయటపెట్టేసింది జాతీయ ఉత్తమనటి నిత్యామీనన్. ‘తిరుచిత్రాంబలం’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటిగా ఇటీవలే ఆమె ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది నిత్యమీనన్.
‘నా అసలు పేరు ఎన్.ఎస్.నిత్య. ఎన్.ఎస్ అనేది నా ఇంటిపేరు కాదు. ‘ఎన్’ అంటే నళిని.. మా అమ్మ పేరు. ‘ఎస్’ అంటే సుకుమార్.. మా నాన్నపేరు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని అలా పెట్టుకున్నా. మా ఫ్యామిలీలో ఇంటిపేర్లను వాడరు. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం మా ఇంట్లో ఇష్టం ఉండదు. అయితే.. వృత్తి రీత్యా దేశవిదేశాలు తిరగాల్సిరావడంతో తప్పనిసరై పాస్‌పోర్ట్‌లో నా పేరుకు ‘మీనన్’ని జత చేశా.
అది కూడా న్యూమరాలజీ ఆధారంగా. ఈ ‘మీనన్’ వల్ల నన్నందరూ మలయాళీ అనుకుంటారు. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఫోన్ చేసి ‘టికెట్ కొచ్చి నుంచి వేయమంటారా మేడమ్..’ అని అడుగుతుంటారు. నాకు నిజంగా నవ్వొస్తుంటుంది. నిజానికి మేం బెంగళూర్ వాసులం. మూడు తరాలుగా మా కుటుంబం అక్కడే ఉంటుంది. స్కూల్లో నా సెకండ్ లాంగ్వేజ్ కన్నడ’ అంటూ అసలు విషయాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు నిత్య మీనన్.