Nithya Menen | పుష్కర కాలం క్రితం వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. అందులో లేడి ఓరియెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ‘కుమారి శ్రీమతి’ ఒకటి.
గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. పెళ్లి బంధంలో చిక్కుకోకుండా.. ఉద్యోగం సద్యోగం లాంటివి చేయకుండా.. స్వంత కాళ్లపై నిలబడి బిజినెస్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఇంటిల్లిపాదిని సంతోషంగా చూసుకోవాలనే లక్ష్యం ఉన్న ఒక వీర వనిత జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్‌తో అరటి పండు ఒలిచి పెట్టినంత క్లారిటీ ఇచ్చారు. అబ్దుల్ కలాం, రజనీకాంత్ తర్వాత ఈమెనే అంట అంటూ గ్లింప్స్‌లోని డైలాగ్ తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఓ క్లారిటీ వచ్చింది. ఇలాంటి పాత్రలను నిత్యామీనన్ చాలా ఈజ్‌తో చేసేస్తుంది.
ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ వీలైనంత త్వరగా ఓటీటీ డేట్‌ను ఫైనల్ చేసి చెప్పనున్నారట. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా నేరుగా స్ట్రీమింగ్ కానుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు కథను అందించాడు.