Nishaanchi | మరాఠా పాపులర్ రాజకీయ నేత దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరి థాకరే హీరోగా నిశాంచి అనే సినిమా తెరకెక్కుతుంది. భారతీయ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కశ్యప్ నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నిశాంచి’, సెప్టెంబర్ 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా మరియు జార్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. అనురాగ్ బ్రాండ్‌కు తగ్గట్టు, ఇందులోని థీమ్, విజువల్స్, పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో ఐశ్వరి థాకరే ద్విపాత్రాభినయం చేశారు. ఆయన బబ్లూ, దబ్లూ అనే కవల సోదరులుగా కనిపించనున్నారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రెండు పాత్రలలోని వైవిధ్యం, నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓ యంగ్ యాక్టర్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ కనబరచడం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది. వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలలో నటించారు. కథ 2000వ దశకంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో నడుస్తుంది. అనురాగ్ స్పెషలిటీ అయిన గ్రౌండెడ్ నేరేషన్, డీప్ ఎమోషనల్ లేయర్లు ఇందులో కూడా కనిపించనున్నాయి. సినిమాలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, హాస్యం అన్ని సమపాళ్లలో ఉండనున్నట్టు తెలుస్తుంది.
‘మా కా ప్యార్’ (అమ్మ ప్రేమ) అనే భావోద్వేగ అంశం కథలో కీలకంగా ఉండటం, కుటుంబ ప్రేక్షకుల్ని కూడా థియేటర్లకు ఆకర్షించే అవకాశం ఉంది.కథను ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా రాశారు. అజయ్ రాయ్, రంజన్ సింగ్ – జార్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఫ్లిప్ ఫిల్మ్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైంది. అనురాగ్ కశ్యప్ సిగ్నేచర్ టచ్‌తో ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ కలిగించేలా ఉంది. ట్రైలర్ విడుదల సందర్భంగా, అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా డైరెక్టర్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ..“అనురాగ్ కశ్యప్ లాంటి డైరెక్టర్‌తో పనిచేయడం గర్వంగా ఉంది. నటీనటుల ప్రతిభ, కథ బలమే ఈ సినిమాకు విజయాన్ని తీసుకొస్తాయన్న నమ్మకం ఉంది” అని తెలిపారు. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.