‘ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. అందరూ హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ సినిమా. ఇందులో నేను కొంతమేర సాఫ్ట్‌గా కనిపిస్తా. పోనూపోనూ అసలు రూపం బయటకొస్తుంది. చాలా కొత్తగా ఉంటుంది నా పాత్ర.’ అని నిహారిక ఎన్.ఎం అన్నారు. ప్రియదర్శికి జోడీగా ఆమె నటించిన కామెడీ డ్రామా ‘మిత్రమండలి’. విజయేందర్ దర్శకుడు. కల్యాణ్ మంతిన, డా.విజయేందర్‌రెడ్డి తీగల, భాను ప్రతాప నిర్మాతలు. బన్నీ వాస్ సమర్పకుడు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిహారిక విలేకరులతో ముచ్చటించింది. ‘నిజానికి తమిళ సినిమా ‘పెరుసు’ కంటే ముందే ఈ కథ విన్నా.
‘మిత్రమండలి’ భారీ కాస్టింగ్‌తో కూడుకున్న సినిమా కావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి టైమ్ పట్టింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా చాలా కంఫర్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న నాకు, సినిమాల్లో కథానాయికగా నటించడం కొత్తగా, ఆనందంగా ఉంది.’ అని నిహారిక చెప్పారు. ప్రియదర్శి మంచి వ్యక్తి, అద్భుతమైన నటుడు అనీ, ‘కోర్ట్’ లాంటి సక్సెస్ తర్వాత కూడా ఆయన ఒదిగే ఉంటారని, దర్శక, నిర్మాతలు సొంత ఫ్యామిలీలా చూసుకున్నారని, టాలీవుడ్లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ ఇంకెక్కడా దొరకలేదని నిహారిక తెలిపారు. ఇంకా చెబుతూ ‘కామెడీ సినిమాలే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే మంచి సినిమాల్లో నటించాలని ఉంది.’ అని పేర్కొన్నారు నిహారిక.