‘నాకెలాంటి సినీ నేపథ్యం లేదు. కానీ హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ ఆశ. అందుకే.. ముందు మోడలింగ్‌లోకి దిగా. తర్వాత తేలిగ్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగలిగా.’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నది అందాలభామ నిధి అగర్వాల్. తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నా. రెండూ పానిండియా ప్రాజెక్టులే. వాటిలో ఒకటి ‘హరిహర వీరమల్లు’ కాగా, రెండోది ‘ది రాజాసాబ్’. రెండూ భిన్నమైన కథలే. వీటిలో ‘హరిహర వీరమల్లు’.. పీరియాడిక్ అంశాలతో కూడిన ఫిక్షన్ కథ.
ఈ సినిమాకోసం రెండున్నర నెలలు గుర్రపుస్వారీ నేర్చుకున్నా. భరతనాట్యం, కథక్‌లోనూ శిక్షణ తీసుకున్నా. కల్యాణ్సార్తో నటించడం మరిచిపోలేని అనుభవం. ఆయన గొప్ప మేధావి. సాహిత్యాభిమాని కూడా. ఇక ‘ది రాజాసాబ్’ సినిమా విషయానికొస్తే.. అది హారర్ కామెడీ మూవీ. అందులో నేను దెయ్యం పాత్ర పోషిస్తున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజంలేదు. అందులో నాపాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచేలా, పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. నా కెరీర్లో ఇలాంటి భారీ సినిమాల్లో భాగం అవుతానని కలలో కూడా అనుకోలేదు.’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.