బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ వివాహం డిసెంబర్ 9న అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ ఈ వేడుకకి వేదికైంది. తమ కొత్త ప్రయాణానికి అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని కత్రినా తన సోషల్ మీడియాలో కోరుతూ పలు ఫొటోలు షేర్ చేసింది కత్రినా. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అయితే కత్రినా పెళ్లికి సంబంధించిన వార్తలను అన్ని వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్ కవర్ చేశాయి. కాని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక.. ‘క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ అని పేపర్లో రాసింది. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో పెళ్లి సంబురాలకు సంబంధించిన ఫొటోలు ప్రచురించతగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయంపై ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రశంసలు కురుస్తున్నాయి.