యువనటుడు గల్లా అశోక్ హీరోగా ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్ ఓ చిత్రాన్ని ప్రారంభించింది. శ్రీగౌరీప్రియా, రాహుల్ విజయ్, శివాత్మిక కీలక పాత్రధారులు. ఉద్భవ్ దర్శకుడు. శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నమ్రత ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా అతిథులందరూ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అమెరికా నేపథ్య కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నదని, కడుపుబ్బా నవ్వించే హాస్యంతోపాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా కూడా ఇందులో ఉంటుందని, ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి కెమెరా: భరద్వాజ్.ఆర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.