Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ అంచనాలను మరింత పెంచేలా ఓటీటీ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏకంగా రూ.130 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల హక్కులు కలిపి ఈ డీల్ కుదిరిందని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమా కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే ఇంత భారీ మొత్తాన్ని రాబట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమా థియేటర్లలో సాధించే విజయాన్ని బట్టి అదనంగా రూ.20 కోట్ల బోనస్ ఇవ్వాలని కూడా నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదించిందట. అంటే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిస్తే, మొత్తం డిజిటల్ డీల్ విలువ రూ.150 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇది రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ ‘పెద్ది పహిల్వాన్’గా, అలాగే క్రికెటర్‌గా రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. నటన, బాడీ లాంగ్వేజ్ పరంగా ఇది ఆయన కెరీర్లో మరో కొత్త ఛాలెంజ్‌గా భావిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా, రిలీజ్‌కు ముందే భారీ డీల్‌తో ‘పెద్ది’ సినిమా ట్రేడ్ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.