IC 814: The Kandahar Hijack | 1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ఘటన గురించి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. IC 814: ది కాందహార్ హైజాక్ ఈ వెబ్ సిరీస్ రాగా.. ఇందులో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పాటు తమిళ నటుడు అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. మిని వెబ్ సిరీస్‌గా ఈ చిత్రం ఆగష్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్‌పై రైట్ వింగ్ సభ్యులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉగ్రవాదుల పేర్లను భోలా, శంకర్ అని పెట్టి హిందువులను టెర్రరిస్ట్‌లుగా టార్గెట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా హిందూ పేర్లను ఎంచుకుని వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఇలా చేయడం వలన మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించే అవకాశం ఉందని ఆరోపించారు.
అయితే ఈ వివాదంపై దర్శకుడు స్పందిస్తూ.. ‘కాందహార్ హైజాక్’ ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులు నిజంగానే భోలా, శంకర్ అంటూ పేర్లు మార్చి విమానంలోకి ప్రవేశించారని తెలిపాడు. ఇందులో ఉద్దేశపూర్వకంగా తానేమి చేయలేదంటూ తెలిపాడు. అయితే ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌కు తాజాగా సమాన్లు అందాయి.
ఈ సినిమాపై వస్తున్న వివాదలపై తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు కేంద్రం నుంచి నోటిసులు అందాయి. ఈ వెబ్ సిరీస్ విషయంలో ఆఫీస్‌కు రావాలంటూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చీఫ్ మోనికా షెర్గిల్‌ను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌ను తీసిన మేకర్స్ ఉద్దేశపూర్వకంగా హైజాకర్ల పేర్లను ‘భోలా’, ‘శంకర్’ లుగా పెట్టినట్లు ఇలా పెట్టి హిందువులను టెర్రరిస్ట్‌లుగా చిత్రీకరిస్తున్నట్లు చేస్తున్నారని కేంద్రం అడిగినట్లు.. ఈ వెబ్ సిరీస్ విషయంలో హైజకర్ల పేర్లను మార్చాలని కేంద్రం ఆదేశించనట్లు సమాచారం.
అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలను నిజాలుగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న IC814 వెబ్ సిరీస్‌లో చుపించినవి మాత్రం నిజాలు కాదు అంటూ తట్టుకోలేక పోవడం వినోదాత్మకంగా, హాస్యాస్పదంగా ఉంది అంటూ వెల్లడించారు.
‘కాందహార్ హైజాక్’ ఘటన వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ అయిన విషయం తెలిసిందే. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ814 నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి లఖ్‌నవూకు వస్తుండగా సాయంత్రం 5 గంటలకు భారత గగనతంలోకి ప్రవేశించగానే అందులోని హైజాకర్లు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. ఇక ఈ విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు.
ఇండియన్ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌తో పాటు తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని అలాగే 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని హైజాకర్లు భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వీరి డిమాండ్లకు ఒప్పుకున్నా భారత ప్రభుత్వం మసూద్ అజహర్‌తో పాటు ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను విడుదల చేసింది. అనంతరం మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించి 2001లో పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై పేలుళ్లు, 2019లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అయితే కాందహార్ ఘటన జరిగి 25 ఏండ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై వెబ్ సిరీస్ తెరకెక్కిచింది నెట్‌ఫ్లిక్స్.