Nenu Sailaja | సున్నితమైన భావోద్వేగాలు, సహజమైన పాత్రలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు–రచయిత కిషోర్ తిరుమల ప్రయాణం ప్రత్యేకమైనది. 2008లో ‘నేను మీకు తెలుసా’ సినిమాతో రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, 2011లో దర్శకుడిగా మారి ప్రేమ, కుటుంబ బంధాలు, యువత మనోభావాలను నిజాయితీగా చూపిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడ్డారు. ముఖ్యంగా ‘నేను శైలజ’ రామ్ పోతినేని కెరీర్లోనే కాదు, కిషోర్ తిరుమల ఫిల్మోగ్రఫీలో కూడా ఓ మైలురాయిగా నిలిచింది.
అలాగే ‘చిత్రలహరి’తో యూత్ ఎమోషన్స్‌ను హృద్యంగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా కథ, సంభాషణల రచయితగా, ఇటీవల ‘మిరాయ్’ సినిమాలో సీఐ అశోక్ పాత్రతో నటుడిగానూ తన పరిధిని విస్తరించారు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నేను శైలజ’ సినిమా హీరోయిన్ ఎంపికపై కిషోర్ తిరుమల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శైలజ పాత్ర ఇంట్రోవర్ట్ స్వభావం కలిగినదిగా ఉండటంతో, ఆ క్యారెక్టర్‌కు కీర్తి సురేశ్ అయితేనే సరిపోతుందని మొదటి నుంచే నమ్మినట్లు ఆయన తెలిపారు. అయితే అది కీర్తికి తొలి సినిమా కావడంతో, నిర్మాతలు అప్పట్లో టాప్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని సూచించారట.
నిర్మాతల మాటకు గౌరవం ఇస్తూనే, ఓ ప్రముఖ హీరోయిన్‌కు కథ చెప్పినప్పటికీ కావాలనే పూర్తి ఎంగేజ్మెంట్తో చెప్పలేదని, ఆమెకు కథ నచ్చలేదని చెప్పగానే “థాంక్యూ” చెప్పి వచ్చేశానని ఆయన వెల్లడించారు. స్టార్ హీరోయిన్ ఇమేజ్ను బ్రేక్ చేసి ప్రేక్షకులు శైలజ పాత్రగా నమ్మడం కష్టమవుతుందని భావించి, కొత్త అమ్మాయిపై రిస్క్ తీసుకున్నానని చెప్పారు. చివరకు అదే నిర్ణయం సరైనదని నిరూపితమై, కీర్తి సురేశ్ నటన శైలజ పాత్రకు ప్రాణం పోసిందన్నారు. ఆ సినిమా కీర్తి కెరీర్‌కు బలమైన పునాది వేసి, ఆమెను ‘మహానటి’ వంటి జాతీయ స్థాయి గుర్తింపుకు చేర్చింది. ఇదిలా ఉండగా, తాజాగా మాస్ మహారాజా రవితేజతో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో కిషోర్ తిరుమల మరో హిట్ అందుకొని, సహజమైన కథనాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.