Bharateeyudu 2 | కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘భారతీయుడు 2′ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 28 ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఆగష్టు 09 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని, వివేక్, కాళిదాస్ జయరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్)కు సామాజిక స్పృహ ఎక్కువ. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి ఘటనలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతన్ని కలవరపరుస్తుంది. అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ అరవిందన్ చేసే పోరాటం ఫలించదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతను ‘భారతీయుడు’ మళ్లీ రావాలంటూ సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో తైవాన్ రాజధాని తైపీలో ఉంటున్న భారతీయుడు (కమల్‌హాసన్) ఇండియాకు తిరిగొస్తాడు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న కొందరు బడా బాబులను అంతమొందిస్తాడు. అదే క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం నింపుతూ రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న అరవిందన్ తండ్రి (సముద్రఖని) సైతం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అవుతాడు. దీంతో మనస్తాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణం సేనాపతియేనని అరవిందన్ అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇండియన్ గోబ్యాక్ అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అవినీతిని అంతమొందిస్తానని తిరిగొచ్చిన సేనాపతిపై సామాన్య ప్రజలు కూడా తిరగబడటానికి కారణాలేమిటి? భారతీయుడి అసలు లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది.
Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp
— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024