నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘ఎన్సీ24’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. నిధి అన్వేషణ నేపథ్యంలో భారతీయ మూలాలు, చరిత్ర, మార్మిక అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బ్రహ్మగిరి గుహ సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాయకానాయికలు నాగచైతన్య, మీనాక్షి చౌదరి పాల్గొంటున్నారు.
కథానుగుణంగా గోదావరి జన్మస్థానంగా ఈ బ్రహ్మగిరి గుహలను చూపిస్తున్నామని, ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్రలో నాగచైతన్య, రక్ష అనే అమ్మాయి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. భారీ వ్యయంతో రూపొందించిన ఈ సెట్ నిర్మాణానికి 50 రోజులు పట్టిందని, కళా దర్శకుడు శ్రీనాగేంద్ర ప్రేక్షకులను అబ్బురపరిచేలా సెట్‌ను తీర్చిదిద్దారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీల్ డి కున్హా, సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కార్తీక్ దండు.