సరోగసీ వివాదంలో ప్రముఖ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు క్లీన్ చిట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం పొందే క్రమంలో ఈ సెలబ్రిటీ దంపతులు సరోగసీ నిబంధనలు అతిక్రమించారనే అంశంపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ విశ్వనాథన్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్నారు.
దర్యాప్తు పురోగతిపై విశ్వనాథన్ స్పందిస్తూ…‘నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా సంతానాన్ని పొందడంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎక్కడా కేసు నమోదు కాలేదు. అయినా మేం పారదర్శకంగా ఉన్నామని చెప్పేందుకు ప్రభుత్వం తరపున స్వతహాగా ఈ దర్యాప్తు చేపట్టాం. మా ప్రాథమిక విచారణలో నయనతార దంపతులు సరోగసీ నిబంధనలు అతిక్రమించారనే ఆధారాలు లభించలేదు. ఆస్పత్రుల ఫైల్స్ పరిశీలించాకే పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అన్నారు.