మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంలో కథానాయిక నయనతార ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నది. సాధారణంగా ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉండే ఈ మలయాళీ సుందరి ఈ సినిమా విషయంలో మాత్రం పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ అయింది మొదలు ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరిలో కొత్త జోష్ నింపుతున్నది. ఏదిఏమైనా నయనతారలో వచ్చిన ఈ మార్పును అందరూ స్వాగతిస్తున్నారు.
అనిల్‌రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో బుధవారం శశిరేఖ పాత్రలో నయనతార ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిసోతున్నది. పసుపురంగు చీరలో ఆమె లుక్ అదిరిపోయిందని, పండగ శోభను ప్రతిఫలిస్తున్నదని ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సినిమాలో శంకరవరప్రసాద్, శశిరేఖ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండిందని, వారి ప్రేమాయణం అందరిని అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.