Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే యష్ బర్త్‌డే పీక్ అంటూ గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అక్షయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యష్‌తో టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నయనతార కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి అంతకంటే ఎక్కువ వివరాలను వెల్లడించలేను. మిగతా సమాచారం అంతా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ వెల్లడిస్తుంది అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో యష్ సరసన నయన్ నటిస్తుండటంతో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 10న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.