అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ నెల 9వ తేదీన పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ జంట వివాహానికి మహాబలిపురంలోని మహబ్ హోటల్ వేదిక కానుంది. వీరిద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. చెన్నై మీడియాలో వచ్చిన కథనాలు, ఈ మధ్య సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ జంట డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ ఆధారంగా పెళ్లి నిశ్చయమైందని భావించారు. తాజాగా ఈ జంట పెళ్లి వార్తలను అధికారికంగా ధృవీకరించారు. శుక్రవారం సాయంత్రం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన నయనతార-విఘ్నేష్ శివన్ తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి రావాల్సిందిగా సీఎంను కోరారు. వారిరువురికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం..పెళ్లికి హాజరవుతానని మాటిచ్చినట్లు తెలిసింది. నయనతార-విఘ్నేష్‌శివన్ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. విఘ్నేష్‌శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.