ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్టార్ హీరోల వల్లే చిత్ర పరిశ్రమ నష్టాల పాలవుతున్నది అంటున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి ప్రమాదకరం అంటూ ఆయన విమర్శలు చేశారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈ నటుడు మాట్లాడుతూ….‘చిత్ర పరిశ్రమలో ప్రతిభను డబ్బు వెంటాడుతుంటుంది. ఒక వ్యక్తి దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే ఎంతైనా డబ్బు చెల్లిస్తామని వెంటపడుతుంటారు. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్నా, మన దగ్గర సరైన కథ లేకుంటే నిరుపయోగమే. మన దగ్గర ఫెయిల్ అయిన సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్గానే చెప్పాలి.
ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే హీరోలే అసలైన దోషులు. వారికి బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఏ బెంగా ఉండదు. అదంతా నిర్మాతల తలనొప్పి. సినిమా ఫ్లాప్ అయితే హీరో, దర్శకుడు, రచయిత బాగానే ఉంటారు. మునిగేది నిర్మాతలే. అదే ఒక చిన్న, మీడియం బడ్జెట్ మూవీ అపజయం పాలైతే నష్టాలు తీవ్రంగా ఉండవు. హీరోలు తమ ఫీజు విషయంలో పునరాలోచన చేయాలి’ అన్నారు.