‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రానికి ఆటోపోటులు ఎంత సహజమో.. జీవితానికి ఒడిదుడుకులు అంత సహజం.’ అంటున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సిద్ధికీ.. తన తాజా ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘ఒకానొక దశలో సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. మానసికంగా కృంగిపోయాను. వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతుండేవి. సినిమాల నుంచి అకారణం తొలిగించబడేవాడ్ని. నా స్థానంలో మరొకర్ని తీసుకునేవారు. నాకే ఎందుకిలా జరుగుతున్నదని కుమిలిపోయేవాడ్ని. దాంతో ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. ఆత్మావిశ్వాసాన్ని కూడా కోల్పోయాను.
దీనికితోడు నా ప్రాణమిత్రులు భౌతికంగా దూరమైపోయారు. వారిలో ఒకడు ఆత్మహత్య చేసుకోగా, మరొకడు అనారోగ్యంతో చనిపోయాడు. వేరొకడు ప్రమాదంలో మృతి చెందాడు. బాధలు పంచుకునే మిత్రులు దూరమవ్వడంతో బతుకే భారమైంది. ఈ చిత్రవధ దాదాపు 8ఏళ్లు అనుభవించా. ఆలోచనల కారణంగా జుట్టు ఊడిపోయింది. శారీరకంగా బలహీనపడ్డా. ఓసారి రైల్లో వెళుతున్న నాకు.. ‘దూకేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది.
డోర్ దగ్గరకొచ్చి అడుగు ముందుకేసేలోపు నా అంతరాత్మ చెప్పింది. అర్థాంతరంగా జీవితాన్ని ముంగించడం మహాపాపం అని. దాంతో ఆ ఆలోచన విరమించుకొని ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. సినిమాలు లేకపోతే వీధి నాటకాలు ప్రదర్శించి బతకాలని నిశ్చయించుకున్నా. అలాంటి సమయంలో 2012 నా తలరాతను మార్చేసింది. ఆ ఏడాది నేను నటించిన గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్, కహానీ, తలాష్ సినిమాలు విడుదలై అఖండ విజయాలను అందుకొని నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టాయి.’ అంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ.