‘ఒక్క చాన్స్ అంటూ తిరిగిన నాకు వరుసగా నాలుగు విజయాలందించిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా వెనుక ఉన్న శక్తి మీరే. సితార ఎంటర్టైన్మెంట్స్ అంటేనే విజయానికి చిరునామా. అలాంటి గొప్ప సంస్థలో నేను చేసిన ఈ సినిమా విజయాన్ని సాధించడం చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది. నిర్మాత నాగవంశీ ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్నిచ్చింది. వరుస విజయాలతో ఆయనెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి.’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.
ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన థ్యాంక్యూ మీట్లో నవీన్ పొలిశెట్టి మాట్లాడారు. ఇంకా చెబుతూ.. సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నదని, రాజ్‌కుమార్ హిరానీ తరహా సినిమాలను తెలుగులో చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇదని, టీమ్ అంతా ప్రాణంపెట్టి పనిచేశారని, అందుకే ఈ విజయం అని నవీన్ పొలిశెట్టి అభిప్రాయపడ్డారు. ఆరేళ్ల తర్వాత తనకు సంతృప్తినిచ్చిన సంక్రాంతి సినిమా ఇదని, 2020లో తాము నిర్మించిన ‘అల వైకుంఠపురంలో’ తర్వాత మళ్లీ అంత విజయం ఇప్పుడే దక్కిందని, కేవలం రెండురోజుల్లోనే 41కోట్ల గ్రాస్‌ని ఈ సినిమా రాబట్టిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇంకా కథానాయిక మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, నటుడు రావురమేశ్, రచయిత్రి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి కూడా మాట్లాడారు.