నటీనటులు: నవీన్ చంద్ర, రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి మరియు ఇతరలు.
దర్శకత్వం: లోకేశ్ అజిల్స్
సంగీతం: డి.ఇమ్మాన్
ఛాయాగ్రహణం: కార్తీక్ అశోకన్
కూర్పు: శ్రీకాంత్.ఎన్.బి
నిర్మాణం: అజ్మల్ ఖాన్, రేయా హరి
సంస్థ: ఎ.ఆర్.ఎంటర్టైన్మెంట్స్
విడుదల: మే 16, 2025
నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘ఎలెవన్’ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా, చిత్ర యూనిట్ నిన్న మీడియా కోసం ప్రత్యేకంగా షోను ఏర్పాటు చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
విశాఖపట్నంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తాయి. బాధితులను గుర్తించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో, ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. అరవింద్ రంగంలోకి దిగిన కూడా హత్యలు ఆగవు. హంతకుడితో పాటు హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. సవాలుగా మారిన ఈ కేసులో చివరకు ఓ చిన్న ఆధారం లభిస్తుంది. అయితే ఈ క్లూతో నేరస్థుడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడు. నేరస్థుడికి ఎవరు సహాయం చేశారు? అసలు ఆ సైకో ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: సినిమా ప్రారంభంలో ఇది ఒక సాధారణమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా అనిపించినా, ఇంటర్వెల్ తర్వాత కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో మనం ఊహించిన విధంగానే కథ సాగుతుంది. అయితే, సెకండ్ హాఫ్‌లో దర్శకుడు ఊహకు అందని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. ఇది కొత్త కథ కానప్పటికీ, తెలివైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అభినందనీయం. రివెంజ్ స్టోరీలు చాలా చూసినప్పటికీ, ఇందులో చూపించిన అంశం లాజికల్‌గా ఉండటం విశేషం. ఒక పోలీస్ ఆఫీసర్ ఆరు హత్యల మిస్టరీని ఛేదించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, అనూహ్యమైన ట్విస్ట్‌లు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే, సినిమాలో మరికొంత మంది తెలిసిన నటీనటులు ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేదని చెప్పవచ్చు.
నటీనటుల ప్రదర్శన:
నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌తో అతను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. హీరోయిన్ పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, ఆ పాత్ర పోషించిన నటి తన పరిధి మేరకు బాగానే నటించింది. శశాంక్, కిరీటి వంటి ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేనప్పటికీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి కూడా చాలా క్రిస్ప్‌గా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. అయితే, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను మరింత బాగా తీర్చిదిద్ది ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చివరిగా:
“ఎలెవన్” షాకింగ్ ట్విస్ట్‌లతో కూడిన ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్ : 2.75/3