నరేష్ వీకే, పవిత్రా లోకేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ వీకే నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నటి పవిత్రా లోకేష్. ఆమె మాట్లాడుతూ…‘నా కెరీర్ ప్రారంభంలో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నాయికగా నటించాను. ఆ తర్వాత నచ్చిన పాత్రలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నా. ఈ సినిమా ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతుంది. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని భావిస్తున్నా. దర్శకుడు ఎంఎస్ రాజు కథ చెప్పినప్పుడు ఇది మీరిద్దరు కలిసి నటిస్తేనే బాగుంటుందని అన్నారు. మాకూ కథ నచ్చి సినిమా చేశాం. సమాజంలో కొన్ని షరతులు పెట్టుకుని ఉంటాం. దాన్ని దాటితే బోల్డ్ అని పిలుస్తారు.
అలా చూస్తే ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇది కల్పిత కథనా? యథార్థమా అనేది సినిమా చూస్తే అర్థమైపోతుంది. జీవితంలో తొలిభాగం కంటే మలిభాగం బాగుండాలనే సందేశం ఈ కథలో ఉంది. ఏ విషయానికీ బాధపడకుండా ఇవాళ బాగుంటే చాలు అనుకుంటారు నరేష్. ఆయన నుంచి ఈ గుణాన్ని నేర్చుకున్నాను. నన్ను బాగా చూసుకుంటారు అంతకంటే కావాల్సింది ఏముంది?. మా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నా విషయానికి వస్తే కొందరు నా పరిస్థితులను అడ్డు పెట్టుకుని తప్పుగా చూశారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నా కెరీర్‌కు ఒక మచ్చ తీసుకొచ్చారు. ఆ సమయంలో నరేష్ అండగా నిలబడ్డారు. ఆయన సహకారంతో మళ్లీ బయటకు రాగలిగాను. కృష్ణ గారి కుటుంబంలో మహేష్ సహా అందరి సపోర్ట్ లభించింది. ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని కథలు కూడా వింటున్నా’ అని చెప్పింది.