Narendra Modi | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా చేసిన ప్రత్యేక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. “తిరు రజనీకాంత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని మోదీ ట్వీట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ, ఆయన నటన తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకుందని కొనియాడారు. రజనీకి లభించిన అపార ప్రజాదరణ అసాధారణమని, భారత సినిమా రంగంలో ఆయన ప్రత్యేకమైన ముద్ర వేయగలిగిన అరుదైన నటుడని ప్రశంసించారు.మోదీ ప్రత్యేకంగా పేర్కొన్న విషయాల్లో ముఖ్యమైనది వివిధ శైలులు, భిన్న పాత్రలతో భారతీయ సినీ పరిశ్రమలో రజనీకాంత్ కొత్త ప్రమాణాలు సృష్టించారని అన్న అంశం.
ఈ సంవత్సరం రజనీకాంత్ సినిమారంగంలో 50 ఏళ్ల మహత్తర ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. బస్ కండక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రజనీ, తన కష్టంతోపాటు, అద్భుతమైన స్టైల్, పర్ఫార్మెన్స్తో నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఒక తమిళ హీరోగా మొదలైన ఆయన ప్రయాణం, భారతీయ సినిమాకు గ్లోబల్ రీచ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా రోబో (Enthiran) చిత్రం రజనీ స్టార్‌డమ్‌ను బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలోకి తీసుకెళ్లింది. 75వ ఏట కూడా రజనీ నటనలో ఎనర్జీ, ప్యాషన్ తగ్గలేదు. వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడం ఆయనకే సాధ్యం. యువ నటులను సైతం ఆశ్చర్యపరచే స్థాయిలో ఆయన ప్రదర్శించే డెడికేషన్‌కు ప్రతి ఒక్కరు ముగ్ధులవుతుంటారు.
అయితే ప్రధాని మోదీ తన పోస్టులో రజనీ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, అభిమానులకు తన ప్రత్యేక శైలి నటనతో మరింత వినోదం అందించాలని ఆకాంక్షించారు. తమిళనాడు నుండి తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ పరిశ్రమల వరకు రజనీకాంత్‌కు అశేష అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా తెలుగులో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ హీరోతోనూ పోల్చలేనిది. సోషల్ మీడియాలో ఇప్పటికే #HBDSuperstarRajinikanth ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు రజనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.