Narendra Modi | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని భారీ బహుభాషా బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘మా వందే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘యశోద’ సినిమాల ద్వారా పరిచయమైన మలయాళ హీరో ఉన్ని ముకుందన్, ఈ సినిమా ద్వారా మోదీ పాత్రను పోషించబోతున్నారు. బాల్యంలో చాయ్ అమ్ముకున్న చిన్నారి నుండి, దేశ ప్రధానిగా మారిన స్థాయిని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ బయోపిక్‌లో మోదీ జీవితం కీలక మలుపులు, ప్రజలతో బంధం, కుటుంబ అనుబంధాలు , ముఖ్యంగా తల్లి హీరాబెన్ మోదీతో ఉన్న బంధం హృద్యంగా చూపించబోతున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ బాహుబలి ఫేమ్ కేఎస్ సెంథిల్ కుమార్ అందిస్తుండగా, కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్: నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్, యాక్షన్ కొరియోగ్రఫీ: కింగ్ సొలమన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గంగాధర్ ఎన్.ఎస్., వాణిశ్రీ బీ., లైన్ ప్రొడ్యూసర్ టీవీఎన్ రాజేష్, కో-డైరెక్టర్ నరసింహారావు ఎం. లాంటి అనుభవజ్ఞులు ఈ ప్రాజెక్ట్‌కి పని చేస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ విడుదల కానుంది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్, ఒక స్ఫూర్తిదాయకమైన జీవనగాథగా నిలవనుంది. 2019లో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘PM Narendra Modi’ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఇప్పుడు ‘మా వందే’ మరింత వాస్తవికత, భావోద్వేగం, దృఢత్వంతో రూపొందనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.