Sundarakanda | యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). ఈ సినిమాకు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా.. అలనాటి నటి శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిడిల్ ఏజ్‌కి వచ్చి యువకుడికి పెళ్లి కష్టాలంటే ఎలా ఉంటాయో అనే కథ ఆధారంగా ఈ చిత్రం రాగా.. వినాయక చవితి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసుకుంటే.!
కథ
సిద్ధార్థ్ (నారా రోహిత్) వయసు ముప్ఫై దాటింది అయిన కూడా పెళ్లి కాని ప్రసాద్‌లా మిగిలిపోతాడు. సిద్ధార్థ్ పెళ్లి కాకపోవడానికి కారణం, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన ఐదు లక్షణాల గురించి పెట్టుకున్న కొన్ని రూల్స్. తనకు వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని ఈ రూల్స్ సాకుతోనే చెడగొడుతుంటాడు. నిజానికి ఈ ఐదు లక్షణాలకు కారణం తన స్కూల్ సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్). వాళ్ళిద్దరి ప్రేమ కథ మధ్యలో ఎవరి వల్ల బ్రేక్ పడింది అనేదే ఒక కథ. ఇక, ఎయిర్ పోర్టులో పరిచయం అయిన ఐరా (వృతి వాఘాని)లో తను కోరుకున్న ఆ ఐదు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటోంది. అమెరికా వెళ్ళబోతున్న ఐరా కోసం, సిద్ధార్థ్ ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరతాడు. తర్వాత సిద్ధార్థ్ ను ఐరా ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లికి వయసులో ఉన్న వ్యత్యాసం కాకుండా మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే రెండో కథ. అయితే ఈ వైష్ణవి, ఐరా కథలు ఎలా కలిశాయి? సిద్ధూ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి) ఇంకా స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) అతనికి ఎలా సహాయం చేశారు? చివరకు సిద్ధార్థ్ కు పెళ్లి అవుతుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘సుందరకాండ’ విషయానికి వస్తే.. చాలా సింపుల్. స్కూల్లో ఇష్టపడిన అమ్మాయిలో తాను గమనించిన ఐదు లక్షణాలు తనకు కాబోయే భార్యలో ఉండాలని హీరో కోరుకుంటాడు. ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన పరిస్థితులే ఈ సినిమా. కథ, స్క్రీన్ ప్లే చాలా సింపుల్‌గా అనిపించినప్పటికీ, ఇది తెలుగులో ఇంతవరకు ఎవరూ చూపించని, చర్చించని కొత్త పాయింట్. హీరోతో పాటు అతని స్నేహితులకు ఎదురైన సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కథకుడిగా, రచయితగా మంచి మార్కులు సాధించారు. ముఖ్యంగా, ప్రేమ విషయంలో, లక్షణాల విషయంలో ఈ కథలో ఉన్న సంఘర్షణను ఆయన చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా, హద్దులు దాటకుండా మంచి డైలాగులు రాశారు. తేలికైన పదాలతోనే లోతైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన రాసిన క్లీన్ కామెడీ సినిమాకు పెద్ద బలం. సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ వర్మ అందించిన సహకారం సినిమాకు బాగా కలిసొచ్చింది. పాటలు, విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.
సినిమాకు ఉన్న ప్రధాన లోపం కథలో కాన్ఫ్లిక్ట్. ట్విస్ట్ చాలా సులభంగా ఊహించగలిగేలా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత, అసలు కథ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అయితే, కామెడీ ఈ లోపాన్ని చాలావరకు కవర్ చేసింది. కథలో రెండు ప్రధాన ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు ఒకటి, ఇంటర్వెల్ తర్వాత మరొకటి. ఈ ట్విస్టులు అంతగా ఆకట్టుకోనప్పటికీ, వాటిని ఆధారంగా చేసుకుని రాసిన సన్నివేశాలు మాత్రం బాగా నవ్విస్తాయి.
నటీనటులు
సిద్ధార్థ్ పాత్రకు నారా రోహిత్ పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఆయన నటనలో, డైలాగ్ డెలివరీలో ఎలాంటి లోపాలు లేవు. తన ఫిజిక్ గురించి వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని బరువు తగ్గుతున్నట్టు ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పినప్పటికీ, ఇంకాస్త తగ్గాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఐరా పాత్రలో వృతి వాఘాని తన క్యూట్ లుక్స్, అమాయకపు నటనతో ఆకట్టుకుంది. అయితే, శ్రీదేవి విజయ్ కుమార్ పక్కన ఆమె కాస్త తేలిపోయింది. ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాల్లో శ్రీదేవి స్క్రీన్ ప్రజెన్స్ డామినేట్ చేసింది. వాసుకి, నరేష్, రూపాలక్ష్మి, అభినవ్ గోమఠం, వీటీవీ గణేష్ వంటి సహాయక నటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా, సత్య – సునైనా ల కామెడీ జోడీ సినిమాకు పెద్ద బలం. వారిద్దరి మధ్య కామెడీ సన్నివేశాలు అదిరిపోయాయి.
సాంకేతికంగా
ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. కొన్ని ట్యూన్స్ ఎక్కడో విన్నట్లు అనిపించినప్పటికీ, సినిమా అంతటా ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడంలో అవి ఎంతగానో తోడ్పడ్డాయి. అలాగే, దర్శకుడి రచన కూడా సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
చివరిగా ‘సుందరకాండ’ కామెడీ, డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. కుటుంబం మొత్తం కలిసి చూసి ఆనందించే సినిమా ఇది.
రేటింగ్ 2.75 / 5