Nara Lokesh | పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి రాత్రి పలు స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకీ పెరుగుతుంది. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని పొందిన పవన్‌పై లోకేష్ అవకాశమొచ్చినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘అన్నా… పవనన్న…’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆయనతో తన బంధాన్ని మరింత బలపరుస్తున్నారు. తెర వెనుక రాజకీయ లెక్కలేమైన ఉన్నా, బయటకు మాత్రం వీరిద్దరి మధ్య నెలకొన్న అనుబంధం అభిమానుల మధ్య సంతోషాన్ని కలిగిస్తోంది. హరిహర వీరమల్లు రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో సినీ రంగం నుంచి మొదలుకుని రాజకీయ నాయకుల వరకూ పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం ట్వీట్ చేస్తూ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఇక కొద్ది సేపటి క్రితం మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లోకేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా కూటమి నేతలు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడంతో పాటు, చిత్రీకరణకు సంబంధించి అవసరమైన అన్ని విధాల సపోర్ట్ కూడా అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.