తెలంగాణ జానపద గీతాల్లో పాపులర్ అయిన ‘యేష నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల’ పాటను నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’లో రీక్రియేట్ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించి విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతాన్ని ఒరిజినల్ సింగర్ జంగిరెడ్డి, ప్రభా ఆలపించారు. ఇప్పటికే పాపులర్ అయిన ఈ జానపద బాణీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తనదైన సినిమాటిక్ ట్రీట్మెంట్తో కొత్త ఫీల్‌ని తీసుకొచ్చారు.
‘జిమ్మేదారి పటేలా..జిమ్మేదారి పటేలా..గల్మ కాడా నీకోసం ముగ్గునైతిరో జిమ్మేదారి పటేలా, నీ తొవ్వల నా సూపులు కావలున్నయో..అర్రల గుడ్డిదీపమయ్యిందిర పానం, బుడ్డపర్కల కూర వండిన నీ కోసం, బుడమట్ల బువ్వతోని తినిపో కొంచెం..’ అంటూ కాసర్ల శ్యామ్ అచ్చ తెలంగాణ మాండలికంలో రాసిన సాహిత్యం ఆకట్టుకుంటున్నది. ఈ పాటలో హీరో నాని, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రత్యేకగీతంలో కనిపించనుంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.