Nani30 Movie | ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఇప్పటీకి ఈ సినిమా సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుంది. గతనెల 30న విడుదలైన దసరా తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్లో నిలిచింది. ఇక నానికి ఈ సినిమాతో తిరుగులేని బ్రేక్ దొరికొంది. అంతేకాకుండా మాస్ ఆడియెన్స్‌లో యూనివర్సల్ యాక్సప్టెన్స్ దొరికింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల హీరోగా మారాడు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం నాని శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడే కోట్లల్లో ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.7.1 కోట్లకు కొనుగోలు చేసిందట. నాని సినిమాల్లో ఇదే అత్యధికం. అంతేకాకుండా డిజిటల్ రైట్స్‌కు కూడా కోట్లల్లో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక్క సినిమాతో మార్కెట్లో నానికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది.
ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. వైరా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ వీక్ సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.