Amaran | ‘మా ‘అమరన్’ని ఇంతబాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూస్తూ కమల్‌హాసన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు చూశాను. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి కథని నడిపించడం ఆయన చాలా బాగా నచ్చింది. ఎమోషన్‌తో పాటు యాక్షన్‌ని కూడా బాగా తీశావ్ అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంస ఎప్పటికీ మర్చిపోను’ అన్నారు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్.మహేంద్రన్, సోనీపిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్‌బ్లెస్ ఎంటైర్టెన్మెంట్తో కలిసి కమల్‌హాసన్ నిర్మించారు. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి తెలుగులో విడుదల చేశారు.
అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్నదని దర్శకడు రాజ్‌కుమార్ పెరియసామి ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘శివకార్తికేయన్ ఈ కథకు బాగా కనెక్ట్ అయిపోయారు. విన్నవెంటనే చేస్తానని చెప్పేశారు. ఇక కథానాయిక ఇందు పాత్రకి సాయిపల్లవి పర్ఫెక్ట్గా ఉంటుందని ముందే అనుకున్నాను. అనుకున్నట్టే ఆ పాత్రకు ప్రాణం పోసింది తను’ అని చెప్పారు దర్శకుడు రాజ్‌కుమార్. ప్రారంభం, ముగింపు ముందే తెలిసిన ఇలాంటి కథను ఎంగేజింగ్‌గా చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెన్స్ని రీ క్రియేట్ చేయడం ఛాలెంజ్‌గా కాకుండా, ఓ బాధ్యతగా భావించాననీ, స్క్రీన్‌ప్లేను క్లియర్‌గా రాసుకొని, ప్రతి షాట్ పేపర్‌పై ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా తీశానని, ఈ సినిమా విషయంలో సహకరించిన ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని రాజ్‌కుమార్ అన్నారు.