కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ముత్తయ్య’. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాసర్ మౌర్య దర్శకుడు. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైందీ సినిమా. ఈ నెల 9న లండన్‌లోని రిచ్మిక్స్లో ప్రీమియర్ కానుంది. ఈ చిత్ర టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘24 ఏళ్ల వయసులో నాకు ‘అష్టా చమ్మా’ సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది’ అంటూ నాని స్పందించారు. నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ…‘జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒకరూ ముత్తయ్యలో కనిపిస్తారు’ అన్నారు.