Nani | ‘ ‘హిట్ 3’ ప్రమోషన్ కంటెంట్ అదిరిపోయింది. దానికి తగ్గట్టే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా. వందశాతం సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి తిపిర్నేని. ఈ సినిమా కూడా హిట్.. నోడౌట్. ‘హిట్’ ఫ్రాంచైజీలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ప్రయత్నిస్తే శైలేష్ చేయగలరు. నాని నా అంచనాలను మించి ఎదిగాడు. ఇంకా ఎదగాలని ఆశిస్తున్నా.’ అని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. అగ్రహీరో నాని అప్ కమింగ్ సినిమా ‘హిట్: ది 3rd కేస్’. శ్రీనిధిశెట్టి కథానాయిక. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ ప్రాంచైజీలో ఇది మూడో సినిమా. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా వచ్చిన రాజమౌళి పై విధంగా స్పందించారు.
హీరో నాని మాట్లాడుతూ – ‘ ఒక థ్రిల్లర్, ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో ‘హిట్ 3’ అలా ఉంటుంది. దర్శకుడిగా శైలేష్ స్ట్రెంత్ ఏంటో మే 1న చూస్తారు. ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నా. షానుజాన్ కెమెరా ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. మిక్కీ.జె.మేయర్ తన ఆర్ఆర్తో ప్రాణం పోశారు. మృదులగా శ్రీనిధి అద్భుతంగా చేసింది. మే1న సినిమాపై మనకున్న ప్రేమను దేశం మొత్తం వినిపించేలా చేద్దాం.’ అని నాని చెప్పారు. ఇంకా రమా రాజమౌళి, విశ్వక్సేన్, అడివి శేషు, డైరెక్టర్ రామ్ జగదీష్, డీవోపీ సానుజాన్ వర్గీస్, కోమలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.