నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే హాట్ టాపిక్‌గా మారింది. అనంతరం విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా సైరెన్ అంటూ మొదలైన ఈ సినిమా సందడి.. టీజర్‌తో మరింత హైప్కొచ్చింది. ధుమ్ ధామ్ దోస్తాన్, ఓరి వారి నీది గాదుర పోరి అంటూ తాజాగా విడుదలైన ఈ సినిమా పాటలు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి.
మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. రీసెంట్గా ఈ సినిమా సీడెడ్ ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ కాగా.. ఆ ఒక్క ఏరియా లోనే రూ. 6 కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే నాని కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో బిజినెస్ జరుగలేదు. దీంతో మిగతా ఏరియాల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము లేపడం ఖాయం అనేలా ఉంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ రెండు నెలల ముందే రూ. 24 కోట్లకి సొంతం చేసుకోగా.. ఆయన వద్ద నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 28 కోట్లు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం.
ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తుండగా, కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. సింగరేణి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో నాని కనిపించనున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.